May 10, 2013

ఆగని పయనం..

రాలిన ఆకుల వెనుక
మిగిలిన రక్తపు చారిక
మట్టిలో కలవనే లేదు..


పగలబడి నవ్వుతూ వీస్తున్న గాలి
ఆలింగనం ఆశ్వాదిస్తూ నేల రాలిని చినుకు
దూరం చేయలేని రక్తపుచారిక..


ఉబికిన కన్నీటితో
గుండెలోతుల్లో ఇంకిపోతూ
వెంటాడుతూ, వెన్నాడుతూ..


అరుణోదయంలో..
గోచరిస్తూ,
నిన్నే జ్ణప్తికి తెస్తూ


సంద్యపు కాంతిలో..
దోబూచులాడుతూ
రెప్పల వెనుక నిన్నే దాచేస్తూ


నిత్యం జ్ణాపకాల నీడలో
ఆగని ఈ పయనంలో
గమ్యం నిర్దేశిస్తూ..

నాన్న... నేను..

తల నిమురుతూ,
తనలో నా స్ధానం గుర్తు చేస్తూ..


గుండెకు హత్తుకుంటూ,
ప్రపంచాన్ని పరిచయం చేస్తూ..


అక్షరాల్ని దిద్దుస్తూ,
చేతి రాతని సరి చేస్తూ..


గెలుపుని ఆశ్వాదిస్తూ,
ఓటమిలో ఓదారిస్తూ..


ప్రతి అడుగులో అండగా నిలుస్తూ,
జీవన గమనాన్ని నిర్దేశిస్తూ..


దూరమైనా సరే,
కన్నీటి వెచ్చదనంలో తిరిగి స్పృశిస్తూ..


సుషుప్తిలో సైతం,
తన ఉనికిని తెలియచేస్తూ..


నాన్న...


తన ప్రేమను ఆశ్వాదిస్తూ..
తన బాటను అనుసరిస్తూ..


ఎప్పటకీ ఇలా మిగిలిన 'నేను"

May 9, 2013

వేసవి.. బాల్యం..

అమ్మ చేతి ముద్ద తింటుండగా,
స్నేహితుని పిలుపు విని..

పరిగెడుతూ, పడిలేస్తూ..

ఊరి చివరి కల్లంలో చింత చెట్టు క్రింద
ఆటలాడుతూ,  కాలాన్ని మర్చిపోతూ..

కోనేరులో జలకాలాటలూ, తుళ్ళింతలతో
వేసవి తాపాన్ని తీర్చుకుంటూ..

వాకాయపల్లు వగరు, చేదు, తీపిని
స్నేహితులతో ఆశ్వాదిస్తూ..

పరిగెడుతూ, పడిలేస్తూ..

తోటమాలి కల్లుగప్పి దాచిన యేనుగు మామిడిని
కాకెంగుల్లతో పంచుకుంటూ..

గెడ్డగట్టున తాటి దుంగపై జారుడు బల్లాడుతూ
ఇసుకలో గూల్లు కడుతూ..

ఈత చెట్టుకున్న మట్టి కుండని గురి చూస్తూ
కాపరి కేకలకు పరుగులంగించుకుంటూ..

పరిగెడుతూ, పడిలేస్తూ..

రైలు పట్టాలపై చెవి ఆనించి
బండి రాకను గమనిస్తూ..

కరణం గారి అరుగుపై
అష్టాచెమ్మాట, దాడి ఆటలాడుతూ..

సాయంత్రం కొత్త కోలనీలో
దొంగ పోలీసు, దాగుడుమూతలూ..

ఏనాటికీ మరువలేని
సహచరుల బంధం,స్నేహితుల సాన్నిహిత్యం..

వేసవిలో బాల్యం గుర్తువస్తే,
వయసు సగమై, మనసు చిందేస్తంది..

May 8, 2013

గెలుపెవరిది...



భుజాలపై భారాన్నంతా మోస్తూ అతను,
అందినది దోచుకుని ఆనందించే నీవు..


తన అడుగే మొదటిదని పయనిస్తూ అతను,
ప్రతి అడుగూ భయంతో వేస్తూ నీవు..


స్వేచ్చకై శ్వాసిస్తూ అతను,
ఆధారం నుండి ముక్కు వరకు ఊపిరందక నువ్వు..


తన ఉనికితో బ్రతుకులను మార్చే బాటలో అతను,
ప్రజల ఉనికిని చిద్రం చేసి, నే ఉన్నానని చెప్పే నీవు..


చివరి అడుగుతోనైనా మార్పు కోరుకునే అతను,
చివరి శ్వాస వరకు జనాన్ని ఏమార్చే నీవు..


గెలిచేది ఎవరు...
ఎవరు...ఎవరు..

తెల్లని రెక్కల శాంతి

ప్రజలందరి ఆకాంక్ష

దగ్గరకు రాని
దరిచేరని శాంతి...


ఆహ్వానం
అందుకోలేదు


తెల్లటొపీదొర ...
పిలిచినా పలకలేదు



పావురాన్ని
ఎగురవేసినా చేరలేదు


శాంతి...

శాంతి...

శాంతి...


మోసమే చేస్తుంది..
మోసగాల్లున్నంత కాలం...