Apr 26, 2010

అరుణ తారలు..

నాటి సామ్రాజ్య విస్తరణలో
పోరాడిన సమిధులం

పరాయి పాలన నుండి
విముక్తి కోరిన విప్లవ యోధులం

నేటి స్వార్ధ రాజకీయాలలో
నిజం చెప్పినందుకు, మేం తీవ్రవాదులం

నాటికీ, నేటికీ, ఎన్నటికీ
వీడనిదీ ఉద్యమ బాట

నిత్యం చైతన్య స్పూర్తితో
అణువణువూ రగులుతుంటే

అన్నార్తుల ఆహాకారాలు
శ్రమజీవుల ఆర్తనాదాలతో

అణగారిన జనజీవనంలో
మార్పు కోసమే యత్నిస్తూ

కాలగర్భంలో కలసిపోయినా
అనునిత్యం వెలుగొందే అరుణతారలం

Apr 22, 2010

అర్ధాయుష్మాన్ భవః

అగ్ని పర్వతాలే లోన దాచుకున్నా
ప్లాస్టిక్, పాలిధీన్ అరగక సతమతమవుతున్నా..

గ్రహాలు, నక్షత్రాలు ఎన్నున్నా
అణ్వాయుధాల బరువు మోయలేకున్నా..

పొగలు, సెగలు మింగి చల్లని గాలినిస్తున్నా
విష వాయువుల ధాటికి తాలలేకున్నా..

చెట్లన్నీ నరకబడి, ఉనికిని కోల్పోయినా
కాల్చిన మంటలకే కరిగిపోతున్నా..

వాగులు వంకలు నదీ నదాలనైనా
కృత్రిమ రసాయనాల్ని మింగలేకున్నా..


సాంకేతిక పరివర్తనలో, సహజ సంపదలమైన మేం..

మీకిస్తున్నాం ఓ వరం, అర్ధాయుష్మాన్ భవః


(ధరిత్రీ దినోత్సవం సందర్భంగా,
గ్లోబల్ వార్మింగ్ హెచ్చరికగా..)

Apr 15, 2010

రగిలే గుండెలు..

గత చరిత్ర
చివరి శ్వాస వరకు సేవలు చేస్తూ మగ్గిన
కట్టు బానిసత్వపు రక్త చారిక..

ప్రాంతీయ ఘర్షణలు
కుల మతాల కార్చిచ్చులూ
తీరని అధికార దాహం కోసం
కుతంత్రాల పన్నాగమేదైనా
నిత్యం సమిధులమవుతున్నాం..

గుడెసెల్ని తగులబెట్టి
వాడల్ని కనుమరుగు చేసి
కబ్జాల క్రింద భూమినాక్రమించి
నిర్మించిన (కలల) సౌధం నిలువదెంతో కాలం..

రక్తం లావాలా ప్రవహిస్తే
నరాలే సంకెళ్లై ఉసురు పోతున్న క్షణం
నిరుపేద గుండె పొరలలో ఎగసిన మంటలకు
నిలువునా ఆహుతైపోతుంది..

Apr 12, 2010

మరణం తర్వాత..





















జననం ఓ జీవి పోరాటం,

మరణం తప్పని విలీనం..

ఆశలు చిగురించే బాల్యం..

ఆత్రపడే యవ్వనం..

అనుభవాల కౌమారం..

జ్ణాపకాల వార్ధక్యం..

మనిషి మనుగడ ఇంతేనా?

సాధిద్దాం  " అసాధ్యాన్ని"

"చావు తర్వాత బ్రతికేందుకు..

చరిత్రలో మనేందుకు"

(అమరుల  బాటవైపు అడుగేస్తూ ..)

Apr 10, 2010

రికమండీసన్..

పెదబాబుగారి రికమండీసన్..

భూమి సిస్తు కట్టడానికి
విత్తనాలు కొనడానికి
నారుకు  నీరు పెట్టడానికి
పొలం  కంచె కట్టడానికి

నాటుబండి నడిచేందుకు
పండిన పంట అమ్మేందుకు
గిడ్డంగిలో ధర పలికేందుకు
మరి  పంటకు అప్పు సేసేందుకు

పెద్దోని  ఉద్యోగాన్కి
చిన్నోడి  కాలేజి సదువుకు
ఇందిరమ్మ పొదుపుకు
ముసల్దాని పించనికి

కులపత్రం రాయాలన్నా
పక్కా ఇల్లు కట్టాలన్నా
కరెంటు కావాలన్నా
ఎలెచ్చెన్లో ఓటేయాలన్నా

అన్నిటికీ కావాల...

సివరికి నా సావుకు
ఎవరి రికమండీసన్ తేవాల..

Apr 8, 2010

అనాధలం..

అమ్మ తోడూ,
నాన్న నీడా కరువై,
బ్రతుకునీడ్చే బండలం..

గుక్కెడు మంచి నీళ్లూ,
పిడికెడు మెతుకుల కోసం,
వెదుకులాడే..

మా జీవితం చిధ్రం
నాగరీకులకిది విచిత్రం..

ఒంటినిండా బట్ట లేదు,
కప్పుకునే  శక్తి లేదు..

నిలువ నీడ లేదు,
ఆశ్రయమిచ్చే మనిషి లేడు..

అడుగడుకగునా అవహేళనలు,
చీత్కారాలే మాకు స్వాగతం..

ఈ పుట్టుక  మాకు శాపం,
మా బ్రతుకందరికీ అపహాశ్యం..

కాదిది దేవుడిచ్చిన వరం,
సమాజం సృష్టించిన అగాధం..

Apr 7, 2010

నగర జీవన చిత్రం..

ఉరుకుల పరుగుల జీవనం,
ఊబకాయమే ఒక వరం..

బడ్జెట్ వడ్డింపుల భారం,

కంపెనీ టార్గెట్లు కఠోరం..

షేర్ మార్కెట్ల బేజారు,

భవిష్యత్ ఊహల కంగారు..

సేవింగ్  చిట్ ఫండ్ షేవింగై,

లోన్ల మోత ఆరంభం..

కలుషితమైన  వాతావరణం,

క్రొత్త జబ్బుల విహారం..

ఉరుకుల పరుగుల జీవనం,
బట్టతల కూడా ఒక వరం..

అయినా  పోతాం ఢాంభీకం,

నవీన నగర జీవన గాంభీర్యం..

Apr 4, 2010

నా పయనం...

నా  పయనం...
గూడు కట్టిన నిశీధి నుండి,
నిర్మలమైన వెలుగుకోసం..

స్వార్ధ పూరిత హృదయాలతో
తోటి మనిషిని గుర్తించని..
ఈ తిక మక  లోకంలో..


పెదాలపై  చిరునవ్వుని సైతం,
నమ్మ లేని ఈ జీవన గమనంలో.

ఇరుకైన మనసుల చట్రంలో,
ఒదగ లేక  అలసిపోతున్నా..


పుట్టుక పరమార్ధం తెలియదు,
బ్రతుకంతా ఎడారైన క్షణంలో...

ఒయాసిస్సును వెతికే ,
ఒంటరి బాటసారిని నేను..
ఎవరికి అందని అక్షర రూపం నేను..

నా  పయనం...
గూడు కట్టిన నిశీధి నుండి,
నిర్మలమైన వెలుగుకోసం..