Jul 11, 2013

"నిరీక్షణ"




మూతపడ్డ కన్నుల వెనుక

రంగు రంగుల స్వప్నం..



గాయపడిన మనసు

చిత్రాన్ని చిత్రించదు..



ఊహకందని స్వప్నం

రంగుల మిళితం కాలేదు..



ఏనాడూ అందని, దరికి రాని,

సంతోషాల మద్య, నిశీధి వెంటాడుతూ..



నిదుర రాని రేయిలో

ప్రతీ క్షణం మేల్కొపులోనే సాగితే..



ఉదయారుణ కిరణాన్ని

మనసుకి అద్దుకుని..



మరలా, ప్రయాణాన్ని సాగిస్తూ,

భవిష్యత్ ఆకాంక్షలనే ఆశిస్తూ..



ఆగని, పయనంలో

బ్రతుకంతా ఎడారిమయం..



చల్లని నీటి బిందువుల కోసం..

అలసినా, ఆగని నిరీక్షణ.











Jul 9, 2013

"నిర్బందం"


కనుచూపు మేరంతా

వడి, వడి ప్రయాణం..



తన కోసం తానే నడుస్తూ

తోటి వారినంతా మరుస్తూ..



అనురాగ వాత్సల్యాలు,

అద్దాల మెరుగులు..



ప్రేమ, అభిమానాలు,

తామరతూడు పై వాన చినుకులు..



సాంకేతికతను, జీవనగమనాన్ని,

ఆకళింపు చేసుకోలేక..



తన గొంతుకు తానే

గొలుసు పెట్టి బంధించి..



స్వేచ్చను శ్వాసించ లేక,

సాధించలేక..



మదనపడుతున్న మనిషి మనుగడ,

నిర్బందించబడిన మానవత్వానికి దర్పణం.









Jul 6, 2013

"ప్రేమ"


 నాడు,



కను సైగలు

ముసిముసి నవ్వులు

ఎదురు చూపులు

చేతుల బాసలు

కవ్వింపులు

గుసగుసలు

దగ్గరున్నా దూరమవవుతూ..

దూరమైనా దగ్గరవడం..

(ఆరాధన, అనుబందం, త్యాగం, జీవితం)


నేడు,


ఇంటర్నెట్

సెల్ ఫోన్

ఎస్.ఎం.ఎస్.

చాటింగ్

సినిమా

పార్టీ

 లాంగ్ డ్రైవ్

ఫైటింగ్

క్రొత్త జోడీ కోసం సెర్చింగ్


(ఫ్యాషన్, ఆడంబబరం, నిస్తేజం, అసంత్రుప్తి)



May 10, 2013

ఆగని పయనం..

రాలిన ఆకుల వెనుక
మిగిలిన రక్తపు చారిక
మట్టిలో కలవనే లేదు..


పగలబడి నవ్వుతూ వీస్తున్న గాలి
ఆలింగనం ఆశ్వాదిస్తూ నేల రాలిని చినుకు
దూరం చేయలేని రక్తపుచారిక..


ఉబికిన కన్నీటితో
గుండెలోతుల్లో ఇంకిపోతూ
వెంటాడుతూ, వెన్నాడుతూ..


అరుణోదయంలో..
గోచరిస్తూ,
నిన్నే జ్ణప్తికి తెస్తూ


సంద్యపు కాంతిలో..
దోబూచులాడుతూ
రెప్పల వెనుక నిన్నే దాచేస్తూ


నిత్యం జ్ణాపకాల నీడలో
ఆగని ఈ పయనంలో
గమ్యం నిర్దేశిస్తూ..

నాన్న... నేను..

తల నిమురుతూ,
తనలో నా స్ధానం గుర్తు చేస్తూ..


గుండెకు హత్తుకుంటూ,
ప్రపంచాన్ని పరిచయం చేస్తూ..


అక్షరాల్ని దిద్దుస్తూ,
చేతి రాతని సరి చేస్తూ..


గెలుపుని ఆశ్వాదిస్తూ,
ఓటమిలో ఓదారిస్తూ..


ప్రతి అడుగులో అండగా నిలుస్తూ,
జీవన గమనాన్ని నిర్దేశిస్తూ..


దూరమైనా సరే,
కన్నీటి వెచ్చదనంలో తిరిగి స్పృశిస్తూ..


సుషుప్తిలో సైతం,
తన ఉనికిని తెలియచేస్తూ..


నాన్న...


తన ప్రేమను ఆశ్వాదిస్తూ..
తన బాటను అనుసరిస్తూ..


ఎప్పటకీ ఇలా మిగిలిన 'నేను"

May 9, 2013

వేసవి.. బాల్యం..

అమ్మ చేతి ముద్ద తింటుండగా,
స్నేహితుని పిలుపు విని..

పరిగెడుతూ, పడిలేస్తూ..

ఊరి చివరి కల్లంలో చింత చెట్టు క్రింద
ఆటలాడుతూ,  కాలాన్ని మర్చిపోతూ..

కోనేరులో జలకాలాటలూ, తుళ్ళింతలతో
వేసవి తాపాన్ని తీర్చుకుంటూ..

వాకాయపల్లు వగరు, చేదు, తీపిని
స్నేహితులతో ఆశ్వాదిస్తూ..

పరిగెడుతూ, పడిలేస్తూ..

తోటమాలి కల్లుగప్పి దాచిన యేనుగు మామిడిని
కాకెంగుల్లతో పంచుకుంటూ..

గెడ్డగట్టున తాటి దుంగపై జారుడు బల్లాడుతూ
ఇసుకలో గూల్లు కడుతూ..

ఈత చెట్టుకున్న మట్టి కుండని గురి చూస్తూ
కాపరి కేకలకు పరుగులంగించుకుంటూ..

పరిగెడుతూ, పడిలేస్తూ..

రైలు పట్టాలపై చెవి ఆనించి
బండి రాకను గమనిస్తూ..

కరణం గారి అరుగుపై
అష్టాచెమ్మాట, దాడి ఆటలాడుతూ..

సాయంత్రం కొత్త కోలనీలో
దొంగ పోలీసు, దాగుడుమూతలూ..

ఏనాటికీ మరువలేని
సహచరుల బంధం,స్నేహితుల సాన్నిహిత్యం..

వేసవిలో బాల్యం గుర్తువస్తే,
వయసు సగమై, మనసు చిందేస్తంది..

May 8, 2013

గెలుపెవరిది...



భుజాలపై భారాన్నంతా మోస్తూ అతను,
అందినది దోచుకుని ఆనందించే నీవు..


తన అడుగే మొదటిదని పయనిస్తూ అతను,
ప్రతి అడుగూ భయంతో వేస్తూ నీవు..


స్వేచ్చకై శ్వాసిస్తూ అతను,
ఆధారం నుండి ముక్కు వరకు ఊపిరందక నువ్వు..


తన ఉనికితో బ్రతుకులను మార్చే బాటలో అతను,
ప్రజల ఉనికిని చిద్రం చేసి, నే ఉన్నానని చెప్పే నీవు..


చివరి అడుగుతోనైనా మార్పు కోరుకునే అతను,
చివరి శ్వాస వరకు జనాన్ని ఏమార్చే నీవు..


గెలిచేది ఎవరు...
ఎవరు...ఎవరు..

తెల్లని రెక్కల శాంతి

ప్రజలందరి ఆకాంక్ష

దగ్గరకు రాని
దరిచేరని శాంతి...


ఆహ్వానం
అందుకోలేదు


తెల్లటొపీదొర ...
పిలిచినా పలకలేదు



పావురాన్ని
ఎగురవేసినా చేరలేదు


శాంతి...

శాంతి...

శాంతి...


మోసమే చేస్తుంది..
మోసగాల్లున్నంత కాలం...

Aug 25, 2010

కర్తవ్యం..

శరీరపు శక్తినంతా,
కళ్లలోన్కి తీసుకొని చూస్తుంటే..

కనుచూపు పరిధిలో
మిగిలిందంతా శూన్యం..

మానవ బంధాలన్ని గొంతు నులిమి,
తమ స్వార్దపు కొలిమిలో కాల్చేసినా..

మిగిలిన మాంసపు ముద్దలకోసం,
విహారం చేస్తున్నాయి రాబందులు..

ఉన్న కాసింత శక్తిని కూడగట్టి,
కొన ఊపిరితో లేచి నిల్చున్నా..

మనిషిని మనిషిగా ప్రేమించే
కొత్త తరాల నిర్మాణం కోసం,

నాంది పలికి, వెనుక నడిచే వాల్లను,
మేల్కొలిపే కర్తవ్యం గుర్తెరిగి..

Aug 24, 2010

అవుట్ సోర్సింగ్..

అవుట్ సోర్సింగ్,
సేలరీ అవుట్..

నీడ నేతల రాజ్యం,
నిరుద్యోగులకిది శాపం..

వేలాపాలా లేని ఉద్యోగం,
వెతలే మా బ్రతుకుకు వరం..

కన్నవాల్లకు కన్నీరు,
కట్టుకున్నవాల్లకు కంగారు..


అవుట్ సోర్సింగ్,
సేలరీ అవుట్..

చేవలేని ప్రభుత్వం,
చేసిందీ దురాగతం..

మూడో చేతికి,
మాబ్రతుకులు మూటకట్టి..

మా శ్రమలో,
కమిషన్ కావాలంటోంది..

నేతల విలాసపు ఖర్చుపాటు కాదు,
మానెలసరి జీతం..

అయినా పట్టని ప్రభుత్వం,
(ఆశలు కల్పిస్తూ) ఆడుకుంటోంది..

నిరుద్యోగుల్ని,
చిరుద్యోగుల్ని చేసి..


(రాష్ర్టంలోని అన్ని అవుట్ సోర్సింగ్
ఉద్యోగాలను ఉద్దేశిస్తూ..)

Aug 23, 2010

యుధ్ధభూమి..

నేర్చవలసిందేముంది..
అంతా యుద్ఢమైనపుడు,

తనపాలు తాపలేని
తల్లి కన్నీటిని చూస్తూ..

పిడికెడు బువ్వ పెట్టలేని
తండ్రి విచారాన్ని చూస్తూ..

మసకబారిన బాల్యంలో
చిరునవ్వును వెదుకుతూ ఎదిగాం..

శక్తిని, శ్రమను చివరికి బ్రతుకునూ
దోచుకునే దొరల రాజ్యంలో..
మాకేం మిగిలిందని,

నేర్వవలసిందల్లా ఒక్కటే..

తుపాకీలో గుండును పెట్టటం..
గుండుకు, గుండెను ఎరపెట్టడం..

(హృదయావేదన ఉప్పొంగిన క్షణం..)

Aug 22, 2010

ఛెలికాడు..

కంటినిండా నీరుబికి,
దృశ్యం కరువైనపుడు..

చేతులు సంకెళ్లుబడి,
చేతనావస్ధ కోల్పోయినపుడు..

కాళ్లు కదలక అర్ధ శరీరం,
ఊబిలో దిగిపోయినట్లున్న క్షణం..


నీ కోసం నేనున్నానంటూ,
తానొచ్చి ఎదురు నిలబడి..

చిటికెని వ్రేళితో,
కష్టాల కన్నీటిని తుడిచేస్తే..

మాటలు రాలేని నా మౌనంతో,
మనసులోనే అనుకున్నా..

నీ రుణం తీర్చుకోలేను నేస్తం,
బ్రతుకంతా ఊడిగం చేసినా..

( నా సోదరుని జన్మదిన కానుకగా...)