Aug 25, 2010

కర్తవ్యం..

శరీరపు శక్తినంతా,
కళ్లలోన్కి తీసుకొని చూస్తుంటే..

కనుచూపు పరిధిలో
మిగిలిందంతా శూన్యం..

మానవ బంధాలన్ని గొంతు నులిమి,
తమ స్వార్దపు కొలిమిలో కాల్చేసినా..

మిగిలిన మాంసపు ముద్దలకోసం,
విహారం చేస్తున్నాయి రాబందులు..

ఉన్న కాసింత శక్తిని కూడగట్టి,
కొన ఊపిరితో లేచి నిల్చున్నా..

మనిషిని మనిషిగా ప్రేమించే
కొత్త తరాల నిర్మాణం కోసం,

నాంది పలికి, వెనుక నడిచే వాల్లను,
మేల్కొలిపే కర్తవ్యం గుర్తెరిగి..

Aug 24, 2010

అవుట్ సోర్సింగ్..

అవుట్ సోర్సింగ్,
సేలరీ అవుట్..

నీడ నేతల రాజ్యం,
నిరుద్యోగులకిది శాపం..

వేలాపాలా లేని ఉద్యోగం,
వెతలే మా బ్రతుకుకు వరం..

కన్నవాల్లకు కన్నీరు,
కట్టుకున్నవాల్లకు కంగారు..


అవుట్ సోర్సింగ్,
సేలరీ అవుట్..

చేవలేని ప్రభుత్వం,
చేసిందీ దురాగతం..

మూడో చేతికి,
మాబ్రతుకులు మూటకట్టి..

మా శ్రమలో,
కమిషన్ కావాలంటోంది..

నేతల విలాసపు ఖర్చుపాటు కాదు,
మానెలసరి జీతం..

అయినా పట్టని ప్రభుత్వం,
(ఆశలు కల్పిస్తూ) ఆడుకుంటోంది..

నిరుద్యోగుల్ని,
చిరుద్యోగుల్ని చేసి..


(రాష్ర్టంలోని అన్ని అవుట్ సోర్సింగ్
ఉద్యోగాలను ఉద్దేశిస్తూ..)

Aug 23, 2010

యుధ్ధభూమి..

నేర్చవలసిందేముంది..
అంతా యుద్ఢమైనపుడు,

తనపాలు తాపలేని
తల్లి కన్నీటిని చూస్తూ..

పిడికెడు బువ్వ పెట్టలేని
తండ్రి విచారాన్ని చూస్తూ..

మసకబారిన బాల్యంలో
చిరునవ్వును వెదుకుతూ ఎదిగాం..

శక్తిని, శ్రమను చివరికి బ్రతుకునూ
దోచుకునే దొరల రాజ్యంలో..
మాకేం మిగిలిందని,

నేర్వవలసిందల్లా ఒక్కటే..

తుపాకీలో గుండును పెట్టటం..
గుండుకు, గుండెను ఎరపెట్టడం..

(హృదయావేదన ఉప్పొంగిన క్షణం..)

Aug 22, 2010

ఛెలికాడు..

కంటినిండా నీరుబికి,
దృశ్యం కరువైనపుడు..

చేతులు సంకెళ్లుబడి,
చేతనావస్ధ కోల్పోయినపుడు..

కాళ్లు కదలక అర్ధ శరీరం,
ఊబిలో దిగిపోయినట్లున్న క్షణం..


నీ కోసం నేనున్నానంటూ,
తానొచ్చి ఎదురు నిలబడి..

చిటికెని వ్రేళితో,
కష్టాల కన్నీటిని తుడిచేస్తే..

మాటలు రాలేని నా మౌనంతో,
మనసులోనే అనుకున్నా..

నీ రుణం తీర్చుకోలేను నేస్తం,
బ్రతుకంతా ఊడిగం చేసినా..

( నా సోదరుని జన్మదిన కానుకగా...)

ధనం మూలం..

కన్న వాళ్ల కౌగిలిని..

సహొదరుని సాన్నిహిత్యాన్ని..

స్నేహితుని పలకరింపుని..

నువ్వు ఆక్రమించేసావ్,

నా దగ్గరేం మిగల్లేదు..

నా ప్రాణం తప్ప,

అది కూడా తీసుకుపోతానంటే..

ఆనందమే నాకు..

కాసులే లేవు నా దగ్గర..

ఆప్యాయతానురాగాలు తప్ప,

నా వాల్లనందర్నీ తలచి.. తలచి.. జారే

రెండు కన్నీటి చుక్కలు తప్ప..

Apr 26, 2010

అరుణ తారలు..

నాటి సామ్రాజ్య విస్తరణలో
పోరాడిన సమిధులం

పరాయి పాలన నుండి
విముక్తి కోరిన విప్లవ యోధులం

నేటి స్వార్ధ రాజకీయాలలో
నిజం చెప్పినందుకు, మేం తీవ్రవాదులం

నాటికీ, నేటికీ, ఎన్నటికీ
వీడనిదీ ఉద్యమ బాట

నిత్యం చైతన్య స్పూర్తితో
అణువణువూ రగులుతుంటే

అన్నార్తుల ఆహాకారాలు
శ్రమజీవుల ఆర్తనాదాలతో

అణగారిన జనజీవనంలో
మార్పు కోసమే యత్నిస్తూ

కాలగర్భంలో కలసిపోయినా
అనునిత్యం వెలుగొందే అరుణతారలం

Apr 22, 2010

అర్ధాయుష్మాన్ భవః

అగ్ని పర్వతాలే లోన దాచుకున్నా
ప్లాస్టిక్, పాలిధీన్ అరగక సతమతమవుతున్నా..

గ్రహాలు, నక్షత్రాలు ఎన్నున్నా
అణ్వాయుధాల బరువు మోయలేకున్నా..

పొగలు, సెగలు మింగి చల్లని గాలినిస్తున్నా
విష వాయువుల ధాటికి తాలలేకున్నా..

చెట్లన్నీ నరకబడి, ఉనికిని కోల్పోయినా
కాల్చిన మంటలకే కరిగిపోతున్నా..

వాగులు వంకలు నదీ నదాలనైనా
కృత్రిమ రసాయనాల్ని మింగలేకున్నా..


సాంకేతిక పరివర్తనలో, సహజ సంపదలమైన మేం..

మీకిస్తున్నాం ఓ వరం, అర్ధాయుష్మాన్ భవః


(ధరిత్రీ దినోత్సవం సందర్భంగా,
గ్లోబల్ వార్మింగ్ హెచ్చరికగా..)

Apr 15, 2010

రగిలే గుండెలు..

గత చరిత్ర
చివరి శ్వాస వరకు సేవలు చేస్తూ మగ్గిన
కట్టు బానిసత్వపు రక్త చారిక..

ప్రాంతీయ ఘర్షణలు
కుల మతాల కార్చిచ్చులూ
తీరని అధికార దాహం కోసం
కుతంత్రాల పన్నాగమేదైనా
నిత్యం సమిధులమవుతున్నాం..

గుడెసెల్ని తగులబెట్టి
వాడల్ని కనుమరుగు చేసి
కబ్జాల క్రింద భూమినాక్రమించి
నిర్మించిన (కలల) సౌధం నిలువదెంతో కాలం..

రక్తం లావాలా ప్రవహిస్తే
నరాలే సంకెళ్లై ఉసురు పోతున్న క్షణం
నిరుపేద గుండె పొరలలో ఎగసిన మంటలకు
నిలువునా ఆహుతైపోతుంది..

Apr 12, 2010

మరణం తర్వాత..





















జననం ఓ జీవి పోరాటం,

మరణం తప్పని విలీనం..

ఆశలు చిగురించే బాల్యం..

ఆత్రపడే యవ్వనం..

అనుభవాల కౌమారం..

జ్ణాపకాల వార్ధక్యం..

మనిషి మనుగడ ఇంతేనా?

సాధిద్దాం  " అసాధ్యాన్ని"

"చావు తర్వాత బ్రతికేందుకు..

చరిత్రలో మనేందుకు"

(అమరుల  బాటవైపు అడుగేస్తూ ..)

Apr 10, 2010

రికమండీసన్..

పెదబాబుగారి రికమండీసన్..

భూమి సిస్తు కట్టడానికి
విత్తనాలు కొనడానికి
నారుకు  నీరు పెట్టడానికి
పొలం  కంచె కట్టడానికి

నాటుబండి నడిచేందుకు
పండిన పంట అమ్మేందుకు
గిడ్డంగిలో ధర పలికేందుకు
మరి  పంటకు అప్పు సేసేందుకు

పెద్దోని  ఉద్యోగాన్కి
చిన్నోడి  కాలేజి సదువుకు
ఇందిరమ్మ పొదుపుకు
ముసల్దాని పించనికి

కులపత్రం రాయాలన్నా
పక్కా ఇల్లు కట్టాలన్నా
కరెంటు కావాలన్నా
ఎలెచ్చెన్లో ఓటేయాలన్నా

అన్నిటికీ కావాల...

సివరికి నా సావుకు
ఎవరి రికమండీసన్ తేవాల..

Apr 8, 2010

అనాధలం..

అమ్మ తోడూ,
నాన్న నీడా కరువై,
బ్రతుకునీడ్చే బండలం..

గుక్కెడు మంచి నీళ్లూ,
పిడికెడు మెతుకుల కోసం,
వెదుకులాడే..

మా జీవితం చిధ్రం
నాగరీకులకిది విచిత్రం..

ఒంటినిండా బట్ట లేదు,
కప్పుకునే  శక్తి లేదు..

నిలువ నీడ లేదు,
ఆశ్రయమిచ్చే మనిషి లేడు..

అడుగడుకగునా అవహేళనలు,
చీత్కారాలే మాకు స్వాగతం..

ఈ పుట్టుక  మాకు శాపం,
మా బ్రతుకందరికీ అపహాశ్యం..

కాదిది దేవుడిచ్చిన వరం,
సమాజం సృష్టించిన అగాధం..

Apr 7, 2010

నగర జీవన చిత్రం..

ఉరుకుల పరుగుల జీవనం,
ఊబకాయమే ఒక వరం..

బడ్జెట్ వడ్డింపుల భారం,

కంపెనీ టార్గెట్లు కఠోరం..

షేర్ మార్కెట్ల బేజారు,

భవిష్యత్ ఊహల కంగారు..

సేవింగ్  చిట్ ఫండ్ షేవింగై,

లోన్ల మోత ఆరంభం..

కలుషితమైన  వాతావరణం,

క్రొత్త జబ్బుల విహారం..

ఉరుకుల పరుగుల జీవనం,
బట్టతల కూడా ఒక వరం..

అయినా  పోతాం ఢాంభీకం,

నవీన నగర జీవన గాంభీర్యం..

Apr 4, 2010

నా పయనం...

నా  పయనం...
గూడు కట్టిన నిశీధి నుండి,
నిర్మలమైన వెలుగుకోసం..

స్వార్ధ పూరిత హృదయాలతో
తోటి మనిషిని గుర్తించని..
ఈ తిక మక  లోకంలో..


పెదాలపై  చిరునవ్వుని సైతం,
నమ్మ లేని ఈ జీవన గమనంలో.

ఇరుకైన మనసుల చట్రంలో,
ఒదగ లేక  అలసిపోతున్నా..


పుట్టుక పరమార్ధం తెలియదు,
బ్రతుకంతా ఎడారైన క్షణంలో...

ఒయాసిస్సును వెతికే ,
ఒంటరి బాటసారిని నేను..
ఎవరికి అందని అక్షర రూపం నేను..

నా  పయనం...
గూడు కట్టిన నిశీధి నుండి,
నిర్మలమైన వెలుగుకోసం..

Mar 26, 2010

ఒరవడి

అక్షరం దిద్దించిన చేయి..
అంతరంగాన్ని స్పృశిస్తుంది

గోరుముద్దంచిన చేయి..
గమ్యం నిర్దేశిస్తుంది

మీ ఒరవడిలో
పయనించాలనంటే..

పోరుబాట  ఒకరిది..
శాంతిమార్గమింకొకరిది..

మంచి  చెడులు కలగలిసిన
మనిషి జీవితంలో..

ఓటమిని ఆంగీకరించను నేను
విజయాన్నే వరిస్తాను నేను..


రెండువైపులా పదునున్న
కత్తిలా మార్చాలి నన్ను..

అను  నిత్యం
ఆశీర్వదించాలి నన్ను..

మీరందించిన  ఉత్తేజం..
అక్షరాన్ని ఆయుధం చేసింది..

ఆగదు  నా పయనం..
ఊపిరి ఆగేంత వరకు..

(నా ఆధ్యాత్మ,  భౌతిక గురుదేవులనుద్దేశించి..)

ప(ని)సి పిల్లలం....

పనిపిల్లలం కాదు
పసిపిల్లలం మేం..

కన్నప్రేగు బాధ దిగమింగి..
పిడికెడు మెతుకుల కోసం
బ్రతుకును తనకా పెట్టిన
అమ్మ నాన్న కోసం..
పనిచేస్తున్నాం మేం..  

అన్నం పెట్టిన చేయి
హింసకు (మానసిక) గురిచేస్తుంటే..
అమ్మకు నాన్నకు చెప్పలేక
వసివాడుతున్న పసికందులం మేం..

మీ సేవలో మా బాల్యం
మసి బారింది..
మాబ్రతుకు  బండి
గాడి తప్పింది..

మీ బిడ్డల సహచరులం..
మీరందించే ఆప్యాయతకు
అనర్హులం  కాదు మేం..

పనిపిల్లలం కాదు
పసి  పిల్లలం మేం..

(పని  చేస్తున్న ఓ చిన్నారి
కంట తడి చూసి..
నా అశ్రువులీ అక్షరాలు..)

Mar 25, 2010

నివాళి

ఉషోదయంలొ..
నన్ను తాకే చిరుగాలిలో...

హ్రుదయ  సవ్వడి విన్పించే..
నిశ్శబ్దమయ క్షణాలలో...
నా ప్రతికదలికలో..

నిద్రపుచ్చే అస్తమయంలో..
నాస్వప్నంలో..

నీతో కలసి గడిపిన క్షణాలు..
మనం  చేసుకున్న బాసలు..

ఎల్లపుడూ ...
నన్ను వెంటాడు తుంటాయి నేస్తం..

ఏం చేయలేను నేను..
అశ్రునయనాలతో
భారమైన గుండెలతో
నివాలులర్పించడం..
నిత్యం జ్ణప్తి చేసుకోవడం తప్ప..

(ఆప్తమిత్రుడు బొత్స గణేష్ అకాల మరణానికి చింతిస్తూ..
ఆత్మ శాంతి కలగాలని ఆకాంక్షిస్తూ...)

Mar 23, 2010

జోహార్లు..



                                                     
                                       ఆమర వీరులకు జోహార్లు..
                                                 బ్రిటిష్ వాని గుండెదడ పెంచి..
                                     ఉరిత్రాటికి ప్రాణాలర్పించి..
                                      జాతికి  స్వేచ్చనందించిన
   
                                         ఆమర వీరులకు జోహార్లు..

Feb 28, 2010

ఎన్నాళ్లు.. ఎన్నేల్లు..

ఏల్ల తరబడి..
కన్నీటిని జారకుండా ఆపుకుంటున్నాం,

పంటిక్రింద వేదనను..
గుండెలోనే అదుముకుంటూ,
ఆప్తులకే దూరమవుతున్నాం..

కాలి క్రింద నేలనే,
కాజేయాలని చూస్తుంటే..

వేయి గొంతులతో నినదిద్దాం..
వేవేల పిడికిళ్ల శక్తిని నిరూపిద్దాం..

సామ్రాజ్యవాద రాక్షసి నెత్తికెక్కి..
ఉద్యమాలననచాలనుకున్న వారంతా,
చరిత్రలో కలిసిపోయారు..

విర్ర వీగిన వారంతా,
వీరుల చేతిలో నేలకొరిగారు..

రండి..కలిసి అడుగులేద్దాం..
బ్రతుకును మార్చే బాటవైపు..

ఆక్రందన..

ప్రేమించాననక పోతే..
యాసిడ్ పోస్తానంటాడొకడు,

మాట్లాడక పోతే..
గొంతు కోస్తానంటాడింకొకడు,

వసతి గ్రుహంలో.. వేధించే వాడొకడు,

కార్యాలయంలో.. హింసించే వాడొకడు,

అరవై దాటినా ఆశగా చూసే వాడొకడు..

రక్షించాల్సింది పోయి, భక్షించే వాడొకడు,

మా కన్నీళ్లతో కడుపు నింపుకొనే వాడొకడు..

పుట్టుక మూలాల్నే మరచిన వారు మీరు,
కన్నపేగు బంధాన్ని కాల రాసిన వారు మీరు..

ఆలనా పాలనా చూసిన మేం..
ఆటబొమ్మలమనుకుంటే..

మా ఆక్రందనలే ఆవేశమైతే,
ఉక్రోషం ఉప్పెనైతే..
మీ బ్రతుకులకు చిరునామా ఉండదు..

Feb 25, 2010

నమ్మకు నేస్తం..

నమ్మకు నేస్తం..
ఖద్దరు చొక్కా వెనక దాగి ఉన్న కసాయి గుండెల్ని..

పధకాలంటాడు.. పండగలంటాడు..

మీటుంగులంటాడు.. మీ బ్రతుకును మార్చేస్తానంటాడు..

కమిషన్ లంటాడు.. కమీసన్ కొట్టేస్తాడు..

నెత్తిన టోపీ పెట్టి.. నీకే టోకరా ఇస్తాడు..

చేతులెత్తి దండం పెట్టి.. గొంతుక పట్టేస్తాడు..

వాడి బ్రతుకు కోసం.. మనల్ని బుగ్గిచేసేస్తాడు..

నమ్మకు నేస్తం..
ఖద్దరు చొక్కా వెనక దాగి ఉన్న కసాయి గుండెల్ని..

ఓటెయ్యకు నేస్తం.. ఆ ఊసరవిల్లికి..

స్వాప్నికం..

సూర్యోదయం ఎరుపు..
అస్తమయం ఎరుపు..

నొసటి కుంకుమ ఎరుపు..
మన రక్తమే ఎరుపు..

భయపెట్టేది ఎరుపు..
బ్రతుకిచ్చేది ఎరుపు..

మా (విధ్యార్దుల) "ఉద్యమస్పూర్తి" ఎరుపు..
మా (ఊపిరి) ఉత్సాహమంతా ఎరుపు..

మా "స్వాప్నిక ప్రపంచ"మంతా ఎరుపు..
మీకు పీడకల (పిరికివానికి) ఎరుపు..

మేరా నామ్ రూపాయ్...

మేరా నామ్ రూపాయ్...

పధకం ప్రకటించి దాచుకో...
పార్టీ ఫండుగా పనికొస్తాను..

పన్నులెగ్గొట్టి దాచుకో..
పడక గదిలో పడి ఉంటాను..

కబ్జాచేసి దాచుకో..
కన్నవాల్లకు పనికొస్తాను..

పేదవాడి కడుపుకొట్టి దాచుకో
ప్రేమగా నీతోనే ఉంటాను..

నన్నే ఆశించు..
నిన్ను అందలం ఎక్కిస్తాను..

నమ్ముకున్న వాల్లనే మోసం చేసావో..
నువ్వంటే నాకు మరీ ఇష్టం..

మేరా నామ్ రూపాయ్..
పైసామే పరమాత్మా హై..

కోల్డ్ వార్...

ప్రచ్చన్నయుద్దం..
కోల్డ్ వార్,

ఇంటా బయటా..
విద్యలో, ఉద్యోగంలో..

ఆర్దికంలో, అసమానత్వంలో..
కోల్డ్ వార్..

మానవ సంబంధాల మద్య
కోల్డ్ వార్..

మతానికీ, అభిమతానికీ..
కోల్ద్ వార్..

రాజకీయ ముసుగులో,
రాష్ట్రానికీ, కేంద్రానికీ మద్య
కోల్డ్ వార్..

గొంతు విప్పి మాట్లాడ గల
దమ్ముంటే..

గుండుగు గుండెను ఎదురు నిల్పే
సత్తా ఉంటే..

రా.... చేయి చేయి కలిపి
ప్రచ్చన్న యుద్దాన్ని...
ప్రత్యక్ష యుద్దంగా మారుద్దాం..

Feb 22, 2010

నీ స్ర్ముతిలో...


అందరి కన్నీళ్ళు
చేతివ్రేళ్లతో తుడిచేద్దామని
బయల్దేరావ్..

శత్రుమూకతో
యుద్దంచేస్తూ...
ఆదమరిచి,

నమ్మినవాళ్ళ వెన్నుపోటుకు
బలైపోయావా నేస్తం..

రూ.500/-

అయిదు వందలనోటు, మాయదారి నోటు. అచ్చం అసలు నొటులా కన్పించి, అమ్మయకుల నోటిలో మట్టి కొడ్తుంది ఈ రోజుల్లో.. మన గవర్నమెంటోల్లు, ఆర్.బి.ఐ. వాల్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. మతలబుగాల్ల మాయల గారడిలో నేడు మాతరిపోతుందీ నోటు. సగటు మనిషికి దిన దిన గండంలా మారిందీ నోటు. జాగ్రత్తవహించండి...

Feb 6, 2010

ఇంకా ఎపుడు...


ధరలు ఎపుడో ఆకాశాన్ని అంటి సగటు మానవుని జీవనం అస్త వ్యస్తం అయింది.. ఎందరో ప్రజలు ఆర్ధిక పరిస్ధితి మెరుగుగా లేక ఆత్మార్పణలు చేసుకున్నారు.. ఉత్పత్తులు పెంచడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాలనుకోనవసరం లేదు, ఇదివరకు ఉన్న ఉత్పత్తులు "బ్లాక్‌ మార్కెటింగ్‌ " బారిన పడకుండా కాపాడడంలో మొదట ప్రభుత్వం సఫలీక్రుతం కావాలి.. బ్లాక్‌ మార్కెటింగ్‌కు పాల్పడిన వారిని కటినంగా శిక్షించాలి...
ఇంతవరకు పెరిగిన ధరల వలన బడా వ్యాపారులు, దళారీలు గాది క్రింద పందికొక్కుల్లా తెగ సంపాయించారు. వారు ఎవరైనా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలి. ప్రభత్వ యంత్రాంగం బంధు ప్రీతి, ఇక ఏ ఇతరత్రా స్వలాభాపేక్షలు లేకుండా పని చేయగలిగితే ధరల పెరుగుదల నివారణ సాధ్యం అవుతుంది. "బ్లాక్‌ మార్కెటింగ్‌ " నివారణే ధరల అదుపుకు గల మార్గం అని నా అభిప్రాయం..

మరో మల్లయ్య...



బళ్ళారిలో భవనం కూలిన సంఘటనలో తొమ్మిది రోజులు శిధిలాల క్రింద బ్రతికిన వ్యక్తి పేరు మల్లయ్య, కాయ కష్టం చేసి బ్రతుకీడుస్తున్న ఆయన ప్రాణంతో అన్ని రోజులు బ్రతక గలిగితే కదా రక్షణ దళం కాపాడ గలిగారు, కాని ప్రాణం పోతే ఎవరు ఇవ్వగలరు..... ఇది జరిగిన రెండు, మూడు రోజుల్లో "మరో మల్లయ్య " (వాచ్ మేన్) హైదరాబాద్‌ నగరం నడి బొడ్డున నారాయణగూడ ఫ్లైఓవర్‌ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం నిర్మాణంలో ఉన్న ఓ ఐదు అంతస్థులు భవనం పేక మేడలా కుప్పకూలి, భవనంలో పనిచేస్తున్న చేస్తున్న 13మంది మరణించగా వాచ్ మేన్ శిధిలాల క్రింద చిక్కు కున్నాడు. ఈ మల్లయ్యను ఎవరు కాపాడతారు.......పటిష్టమైన పునాదులు, పిల్లర్‌లను నిర్మించకుండానే పురాతన పిల్లర్‌లపైనే ఐదంతస్థుల భవనాన్ని నిర్మిస్తున్నారు. కాగా భవన యజమాని కానీ, బిల్డర్‌కానీ జిహెచ్‌ఎంసి నిబంధనలను పాటించకపోవడమే కాకుండా నాణ్యతలేని నిర్మాణ సామాగ్రితో అక్రమంగా నిర్మాణాన్ని చేపట్టారు. ఈ నిర్మాణ పనుల్లో సంబంధిత టౌన్‌ప్లానింగ్‌, ఇతర అధికారులను మచ్చిక చేసుకొని భవన నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలుస్తోంది. 13మందిలో ఒక పసి పాప కూడా చనిపోయింది, మిగిలిన పన్నెండు మంది పెద్దవారు. వీరంతా మహబూబ్‌నగర్‌, మెదక్‌ జిల్లాలకు చెందిన భవన నిర్మాణ కార్మికులు. ఇలా నాసి రకం నిర్మాణాలు చేపట్టి.... యాజమాన్యం, అధికా రులు కలిసి ఎంతమంద ప్రాణాలను బలిగొంటారు. అధికారుల లంచగొండితనఒ పెట్టుబడి దారుల అవకాశమై సామాన్య ప్రజల ప్రాణాలపై గొడ్డలి పెట్టుగా మారింది. వ్రుత్తి నిబద్దతతో అధికార యంత్రాంగం, నిజాయితీతో ప్రభుత్వ శాఖలు పని చేస్తే మరెంత మందో మల్లయ్యలు (సామాన్య ప్రజానీకం) ప్రాణాలతో బ్రతుకుతారు..

Feb 3, 2010

కసాయి తల్లి...

వైష్ణవి, ప్రభాకర్ లను మర్చిపోక ముందే.. మరో వార్తః కడప జిల్లా, పులివెందుల మండలం, మల్లిఖార్జున పురంలో పది సంవత్సరాల చిన్నారి స్వరూప రాణిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేయగా, స్వరూప కేకలు వేయడంతొ
ఏడుగురిలో అయిదుగురు దుండగులను స్దానికులు పట్టుకున్నారని, ఈ కిడ్నాప్ సూత్రధారి స్వరూప కన్నతల్లి అనే వార్తను చూస్తే.. నేటి మానవులలో తల్లి పేగు బందానికి విలువ లేదన్పిస్తుంది.. మానభంగాలు, హత్యలు, దోపిడి, కబ్జాలు, మోసాల నుండి చిన్న పిల్లల దారుణ హత్యల వైపు మన సమాజం మారుతుంటే, ఇది మానవ సమాజమా లేక జంతు సమాజమా? అనే ప్రశ్న మనకు మనం వేసుకునే పరిస్దితి నేడు వచ్చింది. జంతువులు కూడా కన్నపిల్లలను చంపనపుడు, మాట, నడత, తెలివి, అన్ని రకాలుగా జంతువుల కంటే మెరుగైన జీవి అయిన మానవుడు స్వార్దం, డబ్బు సంపాదించాలనే ఆత్యాశ, సమాజంలో పలుకుబడి పెంపొందించుకోవడం కోసం జంతువుల కన్నా హీనంగా మారడం గర్హనీయం... నేటి మానవుని జీవన శైలి నాటి జంతు సమాజం కన్నా భయోత్పాతంగా తయారగుచున్నది. కొత్త రకమయిన నేరాలు రెండు దినాలలో పాతవగుచున్నవి. నేరానికి గల శిక్ష సంవత్సరాల క్రితం నాటిది, లోపభూయిష్టమైన న్యాయవ్యవస్ద, ఎందుకూ మకొరగాని చట్టాలు, ఎన్నికల వాగ్దానాల ప్రభువత్వాలు, పార్టీలు ఉన్నంత కాలం, సరి క్రొత్త నేరాఉ జరుగుతూనే ఉంటాయి, మనం చూస్తూనే ఉంటాం..
మన వ్యవస్దను మనమే మార్చుకోవాలనుకొనే ఆలోచనతోనే సంవత్సరాలు గడిపేసాం.. క్రొత్త తరానికి కూడా పాత చింతకాయ పచ్చడి రీతిలొ.. అభద్రత, మోసపూరితమైన సమాజాన్ని అందిద్దాం....మనం మేలుకోవద్దు... మేలుకొలిపే వాళ్ళను సమాజం నుండి వెలి వేద్దాం... ఇలాగే బ్రతికినంతవరకు లేని నవ్వు పెదాలపై పులుముకొని, నటిస్తూ.. నటనలోనే జీవిస్తూ... బ్రతికేద్దాం.. బ్రతుకీడ్చేద్దాం...

Feb 2, 2010

మానవత్వమా ...ఎక్కడ నీ చిరునామా!


మానవత్వమనే మాటకు చిరునామా వెతుక్కునే పరిస్దితులు నెలకొన్నాయి.. అభం, శుభం తెలియని చిన్నారిని ఆస్ది తగాదాల కోసం బలిగొనడం ..అమానుషం.. చిట్టి తల్లిని చంపేశారు..అనే పత్రిక హెడ్ లైన్స్ చదవగానే.. మనిసషన్న ప్రతివానికీ కల్లు చెమ్మగిల్లుతాయి..నేటి ఉదయం అదే నా స్దితి కూడా. తను మనందరికి దగ్గర కాక పోయినా ఒక చిన్న పాపగా రెండు రోజుల నుండి పత్రికా వార్తల ద్వారా మనందరికీ పరిచయమేగదా.. ఈ చర్య అమానుషం.. ఒక నేరాన్ని చేసే వ్యక్తికి దానికి రెండు రెట్లు వ్యధననుభవించె శిక్ష ఉండాలి. గొంతు కోసినపుడు పడే వేదన, బ్రాయిలర్ మరిగిస్తే కలిగే బాధ నేరస్తునికి తెలియ చెప్పే శిక్ష వేయ గల సత్తా ప్రభుత్వానికి, మన చట్టానికుంటే మరలా మరో "నాగ వైష్ణవి" ఇలాంటి దురాగతానికి బలి కాదు.








Jan 7, 2010

సాయీశ్వర

సాయీశ్వరన్ అనే ఈ బ్లాగ్ ద్వారా నా అభిప్రాయాలను స్నేహితులతో పంచుకోవాలనేదే నా ఆశ. నా బ్లాగును చూసిన తర్వాత వారి అభిప్రాయాలను పంపాలని మనవిచేస్తున్నాను